Saturday, May 12, 2007

మదర్స్ డే

ముందుగా ఈ రోజు మదర్స్ డే సందర్భంగా ప్రపంచంలోని అమ్మలందరికి "ఎ వెరీ వెరీ హ్యపీ మదర్స్ డే".

"అమ్మ" - నాకు తెలిసి ఈ స్రుష్టిలో అమ్మ కన్న గొప్పది ఇంకేమి లేదు. అమ్మే లేకపోతే మనమెవరమూ లేము. మనల్ని నవమాసాలు మోసి, పురుటి నొప్పులు భరించి కని, మనల్ని కంటికి రెప్పలాగా కాపాడి, మన ఆలనా పాలనా చూసి, పెంచి పెద్ద చేస్తుంది. మరి అలాంటి అమ్మకి మనం ఏమి చేసినా తక్కువే.

ఒక విషయంలో మాత్రం నేను లక్కీ అని భావిస్తా. అదేంటంటే చిన్నప్పటి నుంచి కూడా నేను అమ్మని విడిచి ఉన్నది చాలా తక్కువ. చిన్నప్పుడు 10వ తరగతిలో ఒక సంవత్సరం మాత్రం హస్టల్లో ఉన్నాను. అదొక్కటే నేను అమ్మని విడిచి చాలా రోజులు ఉన్నది. తర్వాత పాలిటెక్నిక్ కోసం హైదరాబాద్లో 3 సంవత్సరాలు హస్టల్లో ఉన్నాను కాని ప్రతి శని, ఆది వారాలు తప్పకుండా ఇంటికి వెళ్లేవాడిని. అప్పట్లో మేము నల్లగొండ జిల్లా "ఆలేరు"లో ఉండేవాళ్లం. అది హైదరాబాద్ కి జస్ట్ 70కి.మీ. మాత్రమే. నాన్నగారు రైల్వేలో పనిచేస్తుండడం చేత నాకు అప్పట్లో ఫ్రీ రైల్వే పాస్ ఉండేడిది. అందుకని నాకు అప్పట్లో ఇంటికి దూరంగా ఉన్నాను అనే బెంగ ఉండేది కాదు. కాని పోయినేడాది అమెరికా వెళ్లినప్పుడు మాత్రం అమ్మని, అమ్మ చేతి వంటని చాలా మిస్ అయ్యాను. దాని మీద వ్రాసిన టపా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పాపం మా చిన్న తమ్ముడు మాత్రం ఈ విషయంలో నాకు పూర్తిగా వ్యతిరేకం. వాడు ఇప్పటికి దాదాపు 10 సంవత్సరాలుగా చదువు, ఉద్యోగ నిమిత్తం ఇంటికి దూరంగా ఉంటున్నాడు. వాడి ఉద్యోగం కూడా ఇప్పుడు గుజరాత్ లోని వడొదరలో. మేము ఎప్పుడు మాట్లాడుకున్నా వాడు తప్పకుండా అనే మాట ఒకటి ఏంటంటే "నువ్వు నిజంగా చాలా లక్కీ, ఎప్పుడూ అమ్మ దగ్గరే ఉంటావు" అని.

అమ్మ గురించి ఎక్కడో చదివిన ఈ వాక్యం నాకు ఎంతో ఇష్టం.

"దేవుడు ప్రతి చోట తను ఉండడం సాధ్యం కాక అమ్మను స్రుష్టించాడు" నిజంగా నిజం కదూ ఈ మాట.