Wednesday, June 17, 2009

సంస్కారం

సుమారు ఒక సంవత్సరం క్రితం జరిగింది ఈ సంఘటన.

అవి నేను న్యూజెర్సీ లోని ప్లేయిన్సుబోరో అనే ప్రాంతంలో ఉంటూ న్యూయార్క్ లో పని చేస్తున్న రోజులు.ప్రతి రోజు ఇంటి నుండి ఆఫీసుకి బస్సులో వెళ్లి వస్తుండే వాడిని. రోజు ఉదయం మా ఇంటి ముందు బస్ ఎక్కితే న్యూయార్క్ లోని "పోర్ట్ ఆథారిటి"లో దిగే వాడిని. మరల సాయంత్రం అక్కడ బస్ ఎక్కితే ఇంటి ముందు దిగేవాడిని.

ఇక్కడ మన దగ్గరలాగ బస్ నిండా జనం ఎక్కుదామంటే కుదరదు. సరిగ్గా బస్సులో ఎన్ని ఐతే సీట్లు ఉంటాయో సరిగ్గా అంత మందినే అనుమతిస్తారు. పైగా మా రూట్లో రోజుకు కేవలం ౪ అంటే ౪ బస్సులే ఉండేవి. మనం సరిగ్గా సమయానికి బస్సు స్టాప్ కి వచ్చినా కూడా మనం బస్సు ఎక్కుతామో లేదో అని సందేహముగా ఉండేది. సరిగ్గా నా దగ్గరకి లేదా ఒకరిద్దరు నా ముందు ఉండగానే సీట్లు అయిపోయాయని డ్రైవర్ బస్సు తలుపు మూసివేసిన సంఘటనలు కూడా ఉన్నాయి నా అనుభవములో. మనం సమయానికి వచ్చినా కూడా బస్ దొరక్కపోతే మహా చిరాగ్గా ఉండేది.

నేను ఎక్కాల్సిన బస్ అక్కడ 416 గేట్లో వచ్చేది. అదే గేట్లో మా రూట్ బస్ కాకుండా ఇంకో వేరే రూట్ బస్ కూడా వచ్చేది. నా బస్ సాయంత్రం 5:30 కి అయితే వేరే బస్ 5:40 కో 5:45 కో ఉండేది. రెండు బస్సుల జనం ఒకటే లైనులో నిలబడేవారు. ఎవరి బస్సు వస్తే వారు ఆ లైనులో ముందుకు వెళ్లి బస్ ఎక్కేవాళ్ళు. మిగతావారు అలాగే తర్వాతి బస్సుకి ఎదురుచూసేవారు.

ఆ రోజు నేను 5:30 కి బస్సు ఎక్కుదామని వచ్చాను కాని దురద్రుశ్టావశాత్తు సరిగ్గా నా ముందున్న అతను ఎక్కగానే సీట్లు అయిపోయాయి. అప్పుడు డ్రైవర్ అన్నయ్య నన్ను జాలిగ ఒక చూపు చూసి బై చెప్పి వెళ్లి పోయాడు. ఇంకా చేసేదేమీ లేక అలాగే అదే లైనులో నిల్చున్నాను. ఇంకా నా వెనకాల చాల మంది తర్వాతి వేరే రూట్ బస్సు వాళ్ళు ఉన్నారు. పది నిమిషాలు అయ్యాక ఆ బస్సు రాగానే ఇంకా అందరు వరుసగా ఎక్కేసాకా నేను ఒక్కడినే అలాగే బయట లైనులో నిల్చున్నాను నా బస్సు కోసం ఎదురుచూస్తూ.ఇంకా ఆ బస్సు కూడా బయలు దేరడానికి సిద్దంగా ఉంది. డ్రైవరు కూడా ఇంక తలుపు మూసేసాడు. ఇంక ఆ బస్సు వెళ్ళిపోతే మళ్ళీ ఆ రూట్ బస్సు 30 నిమిషాల తర్వాతే...

సరిగ్గా అప్పుడు సుమారు 50 ఏళ్ళు ఉన్న ఒక అమెరికన్ భుజాన పెద్ద సంచితో బస్సు ఎక్కడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేనేమో కొంచం పక్కన నిలబడి నా బస్సు కోసం ఎదురు చూస్తున్నాను. లైనులో ఎవరు లేకపోవడం, బస్సు ఆల్రెడీ స్టార్ట్ అవటముతో అతను డైరెక్ట్ గా గేట్ తెరుచుకొని బస్ ఎక్కడానికి లోనికి వెళ్ళాడు. గేట్ తెరుచుకొని లోపలికెళ్ళి సరిగ్గా బస్ ఎక్కే సమయానికి అతనికి నేను కనపడ్డాను. అంతే వెంటనే బయటకు వచ్చి "అయాం సారి, మీరు లైనులో ఉన్నారా" అని అడిగాడు. నాకైతే ఒక్క క్షణం ఆశ్చర్యం వేసింది. "లేదండి, నేను వేరే బస్ కోసం ఎదురుచూస్తున్నా" అని చెప్పటముతో కృతఙ్ఞతలు చెప్పి అతను వెళ్లి బస్సులో కూర్చున్నాడు.

నాకైతే నిజంగా అప్పుడు భలే ముచ్చటేసింది. అంత కష్టపడి పరిగెత్తుకుంటూ, ఆయాసముతో వచ్చి కూడా, బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉందని తెలిసి కూడా, పైగా తర్వాతి బస్సు మళ్ళా అరగంట వరకు లేదని తెలిసి కూడా నన్ను చూసి నేను లైనులో ఉన్నానేమో అని బయటకి వచ్చి నన్ను అడిగాడంటే అతని పద్ధతికి, సంస్కారానికి నాకు భలే ఆశ్చర్యం, ఆనందం ఇలా అన్ని అనుభూతులు ఒకేసారి కలిగాయి. అప్పుడు నాకు మన వాళ్ళు మన దేశములో బస్సు స్తాండుల్లో, రైల్వే స్తేషాన్లల్లో చేసే హడావుడి, తొక్కిసలాట, పక్క వాడిని తోసేసి ఎక్కే విధానం అన్ని గుర్తుకు వచ్చాయి. బాధపడాల్సిన విషయం ఏంటంటే ఎలాగు అందరికి చోటు దొరుకుతుందని తెలిసిన కూడా, ఆడవాళ్ళూ, పిల్లలు, వృద్దులు ఉన్నాకూడా మన వాళ్ళు అంత ఓపికగా, చక్కగా వరుసలో నిల్చొని వెళ్ళడం చాల అరుదు.

Friday, June 05, 2009

వావ్, నెదర్లాండ్స్ !!!!

నిజంగా ఈరోజు అద్భుతమే జరిగింది. క్రికెట్లో పసికూనలైన నెదర్లాండ్స్ వాళ్ళు ఐసిసి టి౨౦ ప్రపంచ కప్పు లో ఇంగ్లాండ్ మీద సంచలన విజయం సాదించారు. ఇంగ్లాండ్ వాళ్లు చాలా వీజీగా గెలిచేస్తారని అందరు అనుకుని ఉంటారు కాని నెదర్లాండ్స్ వాళ్ళు చక్కని ఆట ప్రదర్శించి మొదటి మ్యాచ్లోనే సంచలనాన్ని సృష్టించారు. ఇది చూస్తుంటే ముందు ముందు మనకు మళ్ళీ చక్కని వినోదం దొరకబోతోందని అనిపిస్తుంది. మొత్తానికి మళ్ళీ ఒక నెల్లాళ్ళ పాటు అందరం టి.వి.లకు అతుక్కుపొవదమె..చూద్దాం... మన వాళ్ళు ఎలా ఆడతారో...