నాకు తెలిసి ఈ స్రుష్ఠిలో అన్నింటికన్నా రుచికరమైన పధార్థం ఏంటంటే "అమ్మ చేతి వంట". మిగతా వారి సంగతి ఏమో కాని నాకైతే అమ్మ చేతి వంటకి సాటి ఏదీ రాదు. నా చిన్నప్పుడు అమ్మ నాకు అన్నం, పెరుగు, చింతకాయ పచ్చడి కలిపి ఇస్తే ఎంతో ఇష్టంగా తినేవాడిని. కాని అవే అయిటంస్ నేను కలుపుకొని తింటే అంత రుచిగా అనిపించేది కాదు. అప్పట్లొ నేను బాగా ఆలోచించేవాడిని ఏంటబ్బ ఇందులోని గమ్మత్తు, సేం అయిటంస్ అమ్మ కలిపి పెడితే ఎంతో రుచిగా వున్నాయి, కాని నేను కలుపుకొని తింటే మాత్రం అంత రుచిగా లేవు. అదే మరి అమ్మ చేతి మహత్యం అంటే....
మనం ఎప్పుడూ ఇంట్లోనే వుంటూ అమ్మ చేతి వంట తింటుంటే మనకు దాని విలువ తెలీదు. ఎప్పుడైతే మనం ఇంటికి దూరంగా వుంటామో అప్పుడు తెలుస్తుంది. ఇదే అనుభవం నాకు ఎదురయింది, అందుకనే స్వానుభవంతో చెప్తున్నాను.
నేను చిన్నప్పటి నుంచి వంటరిగా వున్నది లేదు. నా చదువులు అన్ని మా స్వంత ఊరిలోనే అయ్యాయి. మధ్యలొ ఒక 3 సం.లు మాత్రం హాస్టల్లో ఉండి చదువుకున్నాను. అందుకని ఎప్పుడూ నాకు వంట చేసుకొని తినే బాధ రాలేదు. కాని పోయినేడాది ఆఫీస్ పని మీద ఒక 2 నెలలు అమెరికా వెళ్లినప్పుడు తెలిసింది అమ్మ చేతి వంట విలువేంటో.
నేను అమెరికా వెళ్లక ముందు వరకు కూడా ఎప్పుడూ మ్యాగీ తిన్నది లేదు. నాకు మన సంప్రదాయ టిఫిన్స్ అయిన ఉప్మా, ఇడ్లీ, వడ ఇవే బాగా నచ్చుతాయి. కాని బర్గర్స్, పిజ్జాస్, మ్యాగీస్ ఇలాంటివి అస్సలు ఇష్టం ఉండవు. మా వాళ్లంతా వండుకోవడం సులువు అని చెప్పి ఒక డజన్ మ్యాగీ పాకెట్స్ నా లగేజ్ లో పెట్టారు. మా అద్రుష్టం కొద్దీ మా హొటల్ పక్కనే మెక్ డోనాల్డ్స్ వుంది. సో అక్కడికి వెల్లగానే మొదటి వారం రోజులు మెక్ డోనాల్డ్స్ లోనే తినేవాళ్లం. అలా ఒక వారం రోజులు తినే సరికి అది కాస్తా మొహం మొత్తింది. ఇంక అప్పుడు మనం వంట చేసుకొని తినాలి అని డిసైడ్ అయ్యాను. అసలు అమెరికా లో వంట చేసుకుందామనే నాకు ఇష్టమైన కూరలు, పప్పులు అన్ని ఇంట్లో వాళ్లతో ఎలా చేయాలో రాయించి మరీ తీసుకెల్లాను ఒక వంటల పుస్తకం.
సరే ఫ్రెష్ గా వారం మొదటి నుంచి మొదలుపెడదామని సోమవారం ఉదయం పొద్దున్నే మ్యాగీ చేసాను. జస్ట్ దాని మీద ఉన్న సూచనలు చదవడం, చేయడం అంతే. చాలా సులువుగా అనిపించింది. అదే మొదటిసారి నేను మ్యాగీ చేయడం, తినడం. అంతకు ముందు రాత్రి సరిగ్గా తిని వుండక పొవడం, పైగా అది మన స్వయం పాకం కావడం, మొదటిసారి ఆ రుచి చూడ్డంతో తినగానే బాగానే అనిపించింది. ఇదేదో బాగుంది కదా అని మొత్తం లాగించేసాను. అప్పుడు దాని రుచి నచ్చింది, సరే ఇదేదో సులువుగా వుంది చేయడం, మధ్యాహ్నం కూడ దీనితోనె కానిచ్చేద్దాం అని రెచ్చిపోయి ఇంకో ప్యాకెట్ మ్యాగీ మళ్లా అప్పుడు వండాను. అలా వండి దానిని నా టిఫిన్ బాక్స్ లొ సర్ది దానినే స్టయిల్ గా ఆఫీస్ కి తీసుకెళ్లాను.
సరే ఇంక మధ్యాహ్నం లంచ్ సమయం అయింది. మన స్వయం పాకం మన దగ్గర వుంది కదా, ఇంక కాంటీన్ కి వెల్లడం ఎందుకు దండగ అని, ఆఫీస్ కిచెన్ లోకి వెళ్లి ఒక కోక్ తెచ్చుకున్నాను. అక్కడే సీట్ లోనే కూర్చోని మ్యాగీ విత్ కోక్ లాగించ్చేద్దాం అని నా టిఫిన్ బాక్స్ మూత తెరిచాను. ఇంకేముంది ఆ మ్యాగీ కాస్తా గట్టిగా అయింది. ఇంక అప్పుడు వేరే దారి లేదు, చచ్చినట్టు అదే తినాల్సిందే. అప్పుడు నా బాధలు ఇంక ఆ భగవంతుడికే తెలియాలి. కొద్ది కొద్దిగా దానిలో నీళ్లు పోసుకుంటూ, ముద్ద ముద్దకు కోక్ తాగుతూ బలవంతంగా మ్యాగీ మొత్తం తినేసాను. అప్పుడు నిజంగా అనిపించింది "అబ్బా, ఎందుకు వచ్చామురా బాబు ఇక్కడికి" అని. ఆ దెబ్బతో మళ్లీ మ్యాగీ అంటేనే విరక్తి వచ్చేసింది. ఆఫ్ కోర్స్ తర్వాత కొన్ని సార్లు తప్పని సరి పరిస్తితుల్లో మ్యాగీ తిన్నాను, తింటున్నాను కూడా.
మొత్తానికి అలా అమెరికా అనుభవాలతో ఏదో కొద్దిగా వంట అదీ నేర్చుకున్నాను. ఇప్పుడు నేను వంట బ్రహ్మండంగా చేయలేకపోయినా చెత్తగా మాత్రం చేయను. కాని నాకు వీలు ఉన్నంతవరకు అమ్మ చేతి వంట తినడానికే ప్రయత్నిస్తాను.
Tuesday, April 10, 2007
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
తెలుగులో రాసిన మొదటి పోస్టే అమ్మ చేతి వంట అంటూ మొదలు పెట్టి మార్కులు కొట్టేసారు.ఇలానే మరిన్ని పోస్టులు చేసి మరిన్ని మార్కులు కొట్టేయండి.
రాధిక గారు, నమస్కారం. మీ కామెంట్ కి చాలా థాంక్స్. మీరు ఇలా మా లాంటి కొత్తవాళ్లను ప్రొత్సహించడం ముదావహం. మీరు, ఇంక మీలాంటి మన తెలుగు బ్లాగ్ మిత్రుల బ్లాగ్స్ చదివి చదివి నాక్కూడా బ్లాగ్ రాయాలనే కోరిక కలిగింది. తప్పకుండా బ్లాగ్ ని రెగ్యులర్ గా రాయడానికి ప్రయత్నిస్తాను.
మీ మ్యాగీ లో నీళ్ళు పోసుకొని తిన్న సంఘటన మాత్రం చాలా నవ్వు తెప్పించిందండీ. నవ్వానని మరోలా అనుకోకండి. అమ్మ చేతి వంట కమ్మదనం అనుభవించి తీరాల్సిందేనండి
Post a Comment