Wednesday, August 05, 2009

'మగధీర' కష్టాలు

పైన టపా శీర్షిక చూసి ఆ సినిమాలో హీరో పడ్డ కష్టాల గురించి నేనేదో వ్రాస్తున్నానని కాదు. ఆ సినిమా చూడడానికి మేము పడ్డ కష్టాల గురించి ఈ టపా.
అసలు నాకు మొదటి నుంచి కూడా సినిమాలంటే ఆసక్తి ఉంది కాని పిచ్చి మాత్రం లేదు. బాగా క్రేజ్ ఉన్న సినిమాని మొదటిరోజే, వీలుయితే మొదటి ఆటే చూడాలని వేలం వెర్రిగా ఎగబడే టైపు కాదు. పైగా ఒకప్పుడు పెద్దగా కష్టపడకుండా టికెట్స్ దొరికాయని కేవలం రెండంటే రెండే సినిమాలు మొదటి రోజే చూడడం, అవి కాస్తా మన 'లెగ్' మహత్యమో ఏమో కాని బాక్సాఫీసు వద్ద బొక్కాబోర్లా పడ్డాయి. అంచేత అప్పటి నుంచి సిని నిర్మాతల శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకొని అప్పటి నుంచి 'మొదటి రోజు ఆట' మానుకున్నాను.
ఇక పొతే ఈ మగధీర సినిమా విషయానికొస్తే, చిత్రం షూటింగ్ జరిగినన్నాల్లు మీడియాలో వచ్చిన కథనాలు చదివి ఈ సినిమాని మొదటి రోజు కాకున్నా తొందరగానే చూడాలని నిశ్చయించుకున్నాను. సినిమా విడుదల అయ్యాక ఇంకా అన్ని సైట్లలో సమీక్షలన్నీ అదరగొట్టే లెవెల్లో ఉండడం చేత ఇంక వెంటనే రంగంలోకి దిగి, ఇద్దరు స్నేహితులను వాళ్ళ కుటుంబాలతో సహా పోగేసి రెండో రోజు మధ్యాన్నం ఆటకి టికెట్స్ బుక్ చేసాము.
ఇక్కడ న్యూజెర్సీలో మేము ఉండే ఏరియాలో థియేటరులు అంతగా బాగుండవు. మా ఇంటికి ఒక ౩ మైళ్ళ దూరములో ఓక్ ట్రి లో ఒక థియేటర్ ఉంది. సాదారణంగా మేము సినిమాలన్నీ అందులోనే చూస్తాము. టికెట్స్ ఈజీగా దొరుకుతాయి. పైగా ఇంటికి చాల దగ్గర, పక్కనే మంచి రెస్టారెంట్లు. హాయిగా తినేసి చక్కగా హాల్లోకి వెళ్ళొచ్చు. కాకపోతే థియేటర్ మాత్రం డొక్కు. అందుకని మా ఇంటికి ఒక ౩౦ మైళ్ళ దూరంలోని ఈస్ట్ విన్డుసార్లోని మల్టిప్లెక్స్ లో ఈ సినిమాకి టికెట్స్ తీసుకున్నాము.
ఇక శనివారం పొద్దున్న తీరిగ్గా లేచి పనులన్నీ చేసుకొని, లంచ్ అయ్యాక రెండు కార్లలో మొత్తం ఆరుగురం సరిగ్గా రెండు గంటలకు బయలు దేరాము. సినిమా ఏమో 3.15 కి. మాములుగా ఐతే 30 నిమిషాలలో అక్కడకి వెళ్ళొచ్చు. కాస్తా ముందుగా వెళ్లి, తీరిగ్గా బండి పార్క్ చేసుకొని, మంచి సీట్లో కూర్చొని(ఎందుకంటే ఇక్కడ మాకు టికెట్స్ మీద సీట్ నెంబర్లు ఉండవు, ఎవరు ముందుగా వస్తే వాళ్లకు మంచి సీట్) సినిమా చూద్దామని అనుకున్నాము.
మాములుగా నేను ఎప్పుడు మా ఇంటి నుంచి అటు వైపు వెళ్ళడానికి రూటు 1 తీసుకుంటాను. కాకపోతే ఆ రోజు నా GPS మాత్రం న్యూజెర్సీ టర్న్ పైక్ మీదుగా తీసుకెళ్ళింది. సరే అలా ఐతే టోల్ రోడ్ కాబట్టి తొందరగా వెళ్ళొచ్చు అని అనుకున్నాను. ఒక పది నిమిషాలు చక్కగా వెళ్ళగానే ఇంక ట్రాఫిక్ జాం మొదలయ్యింది. ఇంక అందులో ఇరుక్కుంటే ముందుకు వేల్లలేము, వెనక్కు రాలేము, పక్కకు జరగలేము. ఆరోజు మా అద్రుష్టం పడిశం పట్టినట్టు పట్టడముతో ఎక్కడి ట్రాఫిక్ అక్కడే ఆగిపోయింది. ఒక పక్క సమయం కావస్తుంది. ఇంక ఆ ట్రాఫిక్ లోనే అలా అలా మెల్లిగా వెళ్లి తర్వాత వచ్చిన ఎక్జిట్ తీసుకొని లోకల్ రోడ్ మీదుగా వెళ్ళేసరికి పుణ్య కాలం కాస్తా అయ్యి సరిగ్గా 4 గంటలకు హాల్లోకి వెళ్ళాము. వెళ్ళేసరికి తెర ముందున్న మొదటి వరుస తప్ప అన్ని సీట్లు నిండిపోయాయి. జీవితములో అలా మొదటి సారిగా ముందు వరుస లో కూర్చొని సినిమా చూసాక తలనొప్పి, మెడ నొప్పి, నడుము నొప్పి పట్టుకున్నాయి. పైగా సినిమా చూసిన ఆనందం అసలు లేకుండా పోయింది. సో కనీసం వచ్చే వీకెండ్ ఆయినా మంచిగా మొదటినుంచి సినిమా చూడాలని అనుకుంటున్నా.

Wednesday, June 17, 2009

సంస్కారం

సుమారు ఒక సంవత్సరం క్రితం జరిగింది ఈ సంఘటన.

అవి నేను న్యూజెర్సీ లోని ప్లేయిన్సుబోరో అనే ప్రాంతంలో ఉంటూ న్యూయార్క్ లో పని చేస్తున్న రోజులు.ప్రతి రోజు ఇంటి నుండి ఆఫీసుకి బస్సులో వెళ్లి వస్తుండే వాడిని. రోజు ఉదయం మా ఇంటి ముందు బస్ ఎక్కితే న్యూయార్క్ లోని "పోర్ట్ ఆథారిటి"లో దిగే వాడిని. మరల సాయంత్రం అక్కడ బస్ ఎక్కితే ఇంటి ముందు దిగేవాడిని.

ఇక్కడ మన దగ్గరలాగ బస్ నిండా జనం ఎక్కుదామంటే కుదరదు. సరిగ్గా బస్సులో ఎన్ని ఐతే సీట్లు ఉంటాయో సరిగ్గా అంత మందినే అనుమతిస్తారు. పైగా మా రూట్లో రోజుకు కేవలం ౪ అంటే ౪ బస్సులే ఉండేవి. మనం సరిగ్గా సమయానికి బస్సు స్టాప్ కి వచ్చినా కూడా మనం బస్సు ఎక్కుతామో లేదో అని సందేహముగా ఉండేది. సరిగ్గా నా దగ్గరకి లేదా ఒకరిద్దరు నా ముందు ఉండగానే సీట్లు అయిపోయాయని డ్రైవర్ బస్సు తలుపు మూసివేసిన సంఘటనలు కూడా ఉన్నాయి నా అనుభవములో. మనం సమయానికి వచ్చినా కూడా బస్ దొరక్కపోతే మహా చిరాగ్గా ఉండేది.

నేను ఎక్కాల్సిన బస్ అక్కడ 416 గేట్లో వచ్చేది. అదే గేట్లో మా రూట్ బస్ కాకుండా ఇంకో వేరే రూట్ బస్ కూడా వచ్చేది. నా బస్ సాయంత్రం 5:30 కి అయితే వేరే బస్ 5:40 కో 5:45 కో ఉండేది. రెండు బస్సుల జనం ఒకటే లైనులో నిలబడేవారు. ఎవరి బస్సు వస్తే వారు ఆ లైనులో ముందుకు వెళ్లి బస్ ఎక్కేవాళ్ళు. మిగతావారు అలాగే తర్వాతి బస్సుకి ఎదురుచూసేవారు.

ఆ రోజు నేను 5:30 కి బస్సు ఎక్కుదామని వచ్చాను కాని దురద్రుశ్టావశాత్తు సరిగ్గా నా ముందున్న అతను ఎక్కగానే సీట్లు అయిపోయాయి. అప్పుడు డ్రైవర్ అన్నయ్య నన్ను జాలిగ ఒక చూపు చూసి బై చెప్పి వెళ్లి పోయాడు. ఇంకా చేసేదేమీ లేక అలాగే అదే లైనులో నిల్చున్నాను. ఇంకా నా వెనకాల చాల మంది తర్వాతి వేరే రూట్ బస్సు వాళ్ళు ఉన్నారు. పది నిమిషాలు అయ్యాక ఆ బస్సు రాగానే ఇంకా అందరు వరుసగా ఎక్కేసాకా నేను ఒక్కడినే అలాగే బయట లైనులో నిల్చున్నాను నా బస్సు కోసం ఎదురుచూస్తూ.ఇంకా ఆ బస్సు కూడా బయలు దేరడానికి సిద్దంగా ఉంది. డ్రైవరు కూడా ఇంక తలుపు మూసేసాడు. ఇంక ఆ బస్సు వెళ్ళిపోతే మళ్ళీ ఆ రూట్ బస్సు 30 నిమిషాల తర్వాతే...

సరిగ్గా అప్పుడు సుమారు 50 ఏళ్ళు ఉన్న ఒక అమెరికన్ భుజాన పెద్ద సంచితో బస్సు ఎక్కడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేనేమో కొంచం పక్కన నిలబడి నా బస్సు కోసం ఎదురు చూస్తున్నాను. లైనులో ఎవరు లేకపోవడం, బస్సు ఆల్రెడీ స్టార్ట్ అవటముతో అతను డైరెక్ట్ గా గేట్ తెరుచుకొని బస్ ఎక్కడానికి లోనికి వెళ్ళాడు. గేట్ తెరుచుకొని లోపలికెళ్ళి సరిగ్గా బస్ ఎక్కే సమయానికి అతనికి నేను కనపడ్డాను. అంతే వెంటనే బయటకు వచ్చి "అయాం సారి, మీరు లైనులో ఉన్నారా" అని అడిగాడు. నాకైతే ఒక్క క్షణం ఆశ్చర్యం వేసింది. "లేదండి, నేను వేరే బస్ కోసం ఎదురుచూస్తున్నా" అని చెప్పటముతో కృతఙ్ఞతలు చెప్పి అతను వెళ్లి బస్సులో కూర్చున్నాడు.

నాకైతే నిజంగా అప్పుడు భలే ముచ్చటేసింది. అంత కష్టపడి పరిగెత్తుకుంటూ, ఆయాసముతో వచ్చి కూడా, బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉందని తెలిసి కూడా, పైగా తర్వాతి బస్సు మళ్ళా అరగంట వరకు లేదని తెలిసి కూడా నన్ను చూసి నేను లైనులో ఉన్నానేమో అని బయటకి వచ్చి నన్ను అడిగాడంటే అతని పద్ధతికి, సంస్కారానికి నాకు భలే ఆశ్చర్యం, ఆనందం ఇలా అన్ని అనుభూతులు ఒకేసారి కలిగాయి. అప్పుడు నాకు మన వాళ్ళు మన దేశములో బస్సు స్తాండుల్లో, రైల్వే స్తేషాన్లల్లో చేసే హడావుడి, తొక్కిసలాట, పక్క వాడిని తోసేసి ఎక్కే విధానం అన్ని గుర్తుకు వచ్చాయి. బాధపడాల్సిన విషయం ఏంటంటే ఎలాగు అందరికి చోటు దొరుకుతుందని తెలిసిన కూడా, ఆడవాళ్ళూ, పిల్లలు, వృద్దులు ఉన్నాకూడా మన వాళ్ళు అంత ఓపికగా, చక్కగా వరుసలో నిల్చొని వెళ్ళడం చాల అరుదు.

Friday, June 05, 2009

వావ్, నెదర్లాండ్స్ !!!!

నిజంగా ఈరోజు అద్భుతమే జరిగింది. క్రికెట్లో పసికూనలైన నెదర్లాండ్స్ వాళ్ళు ఐసిసి టి౨౦ ప్రపంచ కప్పు లో ఇంగ్లాండ్ మీద సంచలన విజయం సాదించారు. ఇంగ్లాండ్ వాళ్లు చాలా వీజీగా గెలిచేస్తారని అందరు అనుకుని ఉంటారు కాని నెదర్లాండ్స్ వాళ్ళు చక్కని ఆట ప్రదర్శించి మొదటి మ్యాచ్లోనే సంచలనాన్ని సృష్టించారు. ఇది చూస్తుంటే ముందు ముందు మనకు మళ్ళీ చక్కని వినోదం దొరకబోతోందని అనిపిస్తుంది. మొత్తానికి మళ్ళీ ఒక నెల్లాళ్ళ పాటు అందరం టి.వి.లకు అతుక్కుపొవదమె..చూద్దాం... మన వాళ్ళు ఎలా ఆడతారో...

Friday, May 22, 2009

శభాష్ డెక్కన్ చార్జర్స్!!!

ఈరోజు జరిగిన IPL2009 మొదటి సెమీఫైనల్లో డెక్కన్ చార్జర్స్ జట్టు పటిష్టమైన డిల్లీ జట్టుని ఖంగు తినిపించి ఫుల్ చార్జింగ్ తో ఫైనల్లోకి అడుగుపెట్టారు. నిజంగా గిల్క్రిస్ట్ ఆట చూడడానికి రెండు కళ్ళు సరిపోవేమో. మొదటి ఓవర్ నుంచే డిల్లీ మీద ఎదురుదాడి చేసి సిసలైన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 35 బంతుల్లో 85 పరుగులు (అందులో 10 ఫోర్లు, 5 సిక్సులు) అంటే ఏ ఫార్మాట్ క్రికెట్లో నైనా అధ్బుతం. ఇదే ఊపు ఆదివారం ఫైనల్లో కూడా చూపించి కప్పు సాదించాలని కోరుకుంటున్నాను. 

ఈరోజు ఆఫీసులో ఉన్నానన్న మాటే కాని పని మీద అసలు మనసు నిలవలేదు. ఆఫీసులో మ్యాచ్ లైవ్ చూడడం కుదరదు కాబట్టి క్రికిన్ఫో వాడి సైట్ ఓపెన్ చేసి బాల్ బాల్ కి స్కోరు చూస్తూ మొత్తానికి పూర్తి మ్యాచ్ చూసాను. అసలే ఈ వీకెండ్ లాంగ్ వీకెండ్ ఆయే. ఆఫీసులో ప్రతి వక్కరు హాలిడే మూడ్లోకి వెళ్లిపోయారు. సందట్లో సడేమియాలాగా మనం క్రికెట్ చూసుకుంటూ గడిపేశాను. మొత్తానికి డెక్కన్ జట్టు గెలిచినందుకు ఆనందంగా ఉంది.

కొసమెరుపు: ఇంకా డిల్లీ జట్టు ఎలాగూ అవుట్ అయింది కాబట్టి ఇంకా కప్పు మన దక్షిణ భారతానిదే.