Thursday, January 13, 2011

మన హీరోలు పరీక్ష రాయటానికి వచ్చారు

మన హీరోలు పరీక్ష రాయటానికి వచ్చారు . వచ్చి ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించారు .

పరిక్ష మొదలైన 10 నిమిషాల తరువాత వచ్చాడు మహేష్ బాబు. ఏంటి బాబు లేట్ అంటే ..

* మహేష్ :* ఎప్పుడు వచ్చామని కాదు అన్నయ్య పరీక్ష రాశామా లేదా ..? అని వెళ్ళి కూర్చున్నాడు .
( వెనకున్న చిరంజీవి బ్రదర్ ఇది తీసుకో అని స్లిప్ ఇచ్చాడు మహేష్ థాంక్స్ చెబితే )

* చీరంజీవి :* థాంక్స్ కాదు బ్రదర్ ఆ స్లిప్ ను మూడు చేసి ముగ్గురికి ఇవ్వు , ఆ ముగ్గురుని ఇంకో ముగ్గురకు ఇవ్వమని చెప్పు అలా మొత్తం స్లిప్ లు మయం చేయండి .

( అనగానే పక్కనే వున్న రామ్ చరణ్ అందుకుని )
* రామ్ చరణ్ : * ఒక్కొకటి కాదు నాన్న , వంద స్లిప్పులు ఒక్కసారి పంపించు 300 వందలమందికి పంచుతా .. ( అని కూర్చున్నాడు . అప్పుడు సాయికుమార్ వచ్చి )

* సాయికుమార్ : * కనిపించే మూడు పేపర్లు .. OMR పేపర్ , క్వశ్చన్ పేపర్ , ఆన్సర్ పేపర్ అయితే కనిపించని ఆ నాలుగో పేపరేరా స్లిప్ ... స్లిప్ ... స్లిప్ . ( అని తన స్లిప్ తను తీసుకుని కూర్చున్నాడు .)

స్లిప్ప్పులు ఎక్కువై కోపం వచ్చిన బాలకృష్ణ
* బాలకృష్ణ :* ఒరేయ్ .. నేను కాపీ కొట్టడం మొదలుపెడితే .... ఏ ప్రశ్నకి ఏ జవాబు రాసానో కనుక్కోవడానికి వారం పట్టిద్ది . మర్యాదగా ఏ ప్రశ్నకు ఏ స్లిప్పో సరిగ్గా చెప్పండి .

మరోపక్క స్లిప్పులు దొరక్క ఎగబడుతున్న వాళ్ళను పక్కకు నెట్టిన ప్రభాస్
* ప్రభాస్ : * వాడు పొతే వీడు , వీడు పొతే నేను , నేను పొతే నా అమ్మామొగుడు అని ఎవరైనా స్లిప్ కోసం ఎగబడితే ... దెబ్బకో తలకాయ్ చొప్పున బెంచిలకి బలవుతాయి అని స్లిప్పు తెచ్చుకు రాసుకుంటున్నాడు .

యన్ . టి . ఆర్ బుద్దిగా తన స్లిప్పు తను రాసుకుంటుంటే ఎవడో వచ్చి స్లిప్పు లాక్కోబోతే వాడి చెయ్యి గట్టిగా పట్టుకుని
* జూ || యన్ . టి . ఆర్ : * రేయ్ ... సాఫ్ట్ గా లవర్ బాయ్ లాగా ఉన్నాడు అనుకుంటూన్నవేమో ... లోపల ఒరిజినల్ అలాగే ఉంది . స్లిప్పు వదల్లేదో ..... రచ్చ .. రచ్చే ..! అన్నాడు .

ఈ లోపు ఎగ్జామ్ స్క్వాడ్ వచ్చి పేపర్లు లాక్కుని అందరినీ బయటకు పంపారు . ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారా ... అని అందరు ఆలోచిస్తుంటే , అందరికన్నా చివరన వచ్చాడు రవితేజ )

* రవితేజ : * ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారా .. అనేగా మీ డవుటు .... నేనే ... ఇచ్చా ...! ఊరికినే కాపీ కొడితే .... కిక్ ఏముంది నా అప్పడం . అందుకే స్క్వాడ్ ను పిలిచా ..! అని అక్కడి నుండి పరిగెత్తాడు .

పట్టుకోవడానికి రవితేజ వెనకాల పడ్డారు మిగిలిన అందరు ..

Source: Forward e-mail.

Sunday, June 20, 2010

ఫాదర్స్ డే

ఈ రోజు జీవితంలో మొదటిసారిగా "ఫాదర్స్ డే"కి శుభాకాంక్షలు అందుకున్నాను. పొద్దున్న లేవగానే మా పాప తను స్వయంగా చేసిన గిఫ్ట్ కార్డ్ నాకు ఇచ్చి ఒక పెద్ద సర్ప్రయిస్ ఇచ్చింది.




Friday, April 16, 2010

మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా?


మన అందరికి తెలుసు Twitter ఎంత ప్రాచుర్యం పొందిందో.. నేను చాలా సార్లు వార్తల్లో చదివాను ఈ సైట్ ఎక్కువ లోడ్ ని తట్టుకోలేక క్రాష్ అయింది అని కాని నాకు ఈరోజు మొదటిసారిగా ఆ అనుభవం ఎదురయింది. ఈ రోజు పొద్దున్న Albuquerque విమానాశ్రయంలో నే ఎక్కాల్సిన విమానం కోసం ఎదురు చూస్తూ సమయం ఉంది కదా అని twitter లో లాగిన్ అయ్యేసరికి సైట్ డౌన్ అని కనపడింది.

Friday, February 05, 2010

తెలంగాణా వచ్చాక

తెలంగాణా వచ్చాక మన సినిమాలు...
౧. నరసింహ నాయుడు - నర్సింగ్ యాదవ్.
౨. పరుగు - ఉరుకు
౩. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి - గాడ పోరి గీడ పోరడు
౪. సిద్దు ఫ్రం శ్రీకాకుళం - మల్లేష్ ఫ్రం మల్కాజిగిరి
౫. చాలా బాగుంది - జాబర్దస్తుంది
౬. అవునన్నా కాదన్నా - ఔ మల్ల లే మల్ల
౭. సంక్రాంతి - బోనాలు
౮. అమ్మాయిలు అబ్బాయిలు - పోరిలు పోరగాల్లు
౯. పల్నాటి బ్రహ్మనాయుడు - కరీంనగర్ KCR
౧౦. నారి నారి నడుమ మురారి - పోరి పోరి నడుమ తివారి
౧౧. చంటబ్బాయి - చిన్న పోరడు
౧౨. పులి - షేర్
౧౩. ౪౭ రోజులు - ౪౭ దినాలు
౧౪. మా నాన్నకు పెళ్లి - మా అయ్యకు లగ్గం
౧౫. ఇడియట్ - దేడ్ దిమాక్ గాడు
౧౬. వరుడు - పెండ్లి కొడుకు
౧౭. పోకిరి - ఫాల్తు బాడ్కావ్
౧౮. మరణ మృదంగం - సావు డప్పు
౧౯. హ్యాపీ డేస్ - కుషి దినాలు
౨౦. ఆవిడా మా ఆవిడే - గామే భి నా పెండ్లామె

Wednesday, August 05, 2009

'మగధీర' కష్టాలు

పైన టపా శీర్షిక చూసి ఆ సినిమాలో హీరో పడ్డ కష్టాల గురించి నేనేదో వ్రాస్తున్నానని కాదు. ఆ సినిమా చూడడానికి మేము పడ్డ కష్టాల గురించి ఈ టపా.
అసలు నాకు మొదటి నుంచి కూడా సినిమాలంటే ఆసక్తి ఉంది కాని పిచ్చి మాత్రం లేదు. బాగా క్రేజ్ ఉన్న సినిమాని మొదటిరోజే, వీలుయితే మొదటి ఆటే చూడాలని వేలం వెర్రిగా ఎగబడే టైపు కాదు. పైగా ఒకప్పుడు పెద్దగా కష్టపడకుండా టికెట్స్ దొరికాయని కేవలం రెండంటే రెండే సినిమాలు మొదటి రోజే చూడడం, అవి కాస్తా మన 'లెగ్' మహత్యమో ఏమో కాని బాక్సాఫీసు వద్ద బొక్కాబోర్లా పడ్డాయి. అంచేత అప్పటి నుంచి సిని నిర్మాతల శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకొని అప్పటి నుంచి 'మొదటి రోజు ఆట' మానుకున్నాను.
ఇక పొతే ఈ మగధీర సినిమా విషయానికొస్తే, చిత్రం షూటింగ్ జరిగినన్నాల్లు మీడియాలో వచ్చిన కథనాలు చదివి ఈ సినిమాని మొదటి రోజు కాకున్నా తొందరగానే చూడాలని నిశ్చయించుకున్నాను. సినిమా విడుదల అయ్యాక ఇంకా అన్ని సైట్లలో సమీక్షలన్నీ అదరగొట్టే లెవెల్లో ఉండడం చేత ఇంక వెంటనే రంగంలోకి దిగి, ఇద్దరు స్నేహితులను వాళ్ళ కుటుంబాలతో సహా పోగేసి రెండో రోజు మధ్యాన్నం ఆటకి టికెట్స్ బుక్ చేసాము.
ఇక్కడ న్యూజెర్సీలో మేము ఉండే ఏరియాలో థియేటరులు అంతగా బాగుండవు. మా ఇంటికి ఒక ౩ మైళ్ళ దూరములో ఓక్ ట్రి లో ఒక థియేటర్ ఉంది. సాదారణంగా మేము సినిమాలన్నీ అందులోనే చూస్తాము. టికెట్స్ ఈజీగా దొరుకుతాయి. పైగా ఇంటికి చాల దగ్గర, పక్కనే మంచి రెస్టారెంట్లు. హాయిగా తినేసి చక్కగా హాల్లోకి వెళ్ళొచ్చు. కాకపోతే థియేటర్ మాత్రం డొక్కు. అందుకని మా ఇంటికి ఒక ౩౦ మైళ్ళ దూరంలోని ఈస్ట్ విన్డుసార్లోని మల్టిప్లెక్స్ లో ఈ సినిమాకి టికెట్స్ తీసుకున్నాము.
ఇక శనివారం పొద్దున్న తీరిగ్గా లేచి పనులన్నీ చేసుకొని, లంచ్ అయ్యాక రెండు కార్లలో మొత్తం ఆరుగురం సరిగ్గా రెండు గంటలకు బయలు దేరాము. సినిమా ఏమో 3.15 కి. మాములుగా ఐతే 30 నిమిషాలలో అక్కడకి వెళ్ళొచ్చు. కాస్తా ముందుగా వెళ్లి, తీరిగ్గా బండి పార్క్ చేసుకొని, మంచి సీట్లో కూర్చొని(ఎందుకంటే ఇక్కడ మాకు టికెట్స్ మీద సీట్ నెంబర్లు ఉండవు, ఎవరు ముందుగా వస్తే వాళ్లకు మంచి సీట్) సినిమా చూద్దామని అనుకున్నాము.
మాములుగా నేను ఎప్పుడు మా ఇంటి నుంచి అటు వైపు వెళ్ళడానికి రూటు 1 తీసుకుంటాను. కాకపోతే ఆ రోజు నా GPS మాత్రం న్యూజెర్సీ టర్న్ పైక్ మీదుగా తీసుకెళ్ళింది. సరే అలా ఐతే టోల్ రోడ్ కాబట్టి తొందరగా వెళ్ళొచ్చు అని అనుకున్నాను. ఒక పది నిమిషాలు చక్కగా వెళ్ళగానే ఇంక ట్రాఫిక్ జాం మొదలయ్యింది. ఇంక అందులో ఇరుక్కుంటే ముందుకు వేల్లలేము, వెనక్కు రాలేము, పక్కకు జరగలేము. ఆరోజు మా అద్రుష్టం పడిశం పట్టినట్టు పట్టడముతో ఎక్కడి ట్రాఫిక్ అక్కడే ఆగిపోయింది. ఒక పక్క సమయం కావస్తుంది. ఇంక ఆ ట్రాఫిక్ లోనే అలా అలా మెల్లిగా వెళ్లి తర్వాత వచ్చిన ఎక్జిట్ తీసుకొని లోకల్ రోడ్ మీదుగా వెళ్ళేసరికి పుణ్య కాలం కాస్తా అయ్యి సరిగ్గా 4 గంటలకు హాల్లోకి వెళ్ళాము. వెళ్ళేసరికి తెర ముందున్న మొదటి వరుస తప్ప అన్ని సీట్లు నిండిపోయాయి. జీవితములో అలా మొదటి సారిగా ముందు వరుస లో కూర్చొని సినిమా చూసాక తలనొప్పి, మెడ నొప్పి, నడుము నొప్పి పట్టుకున్నాయి. పైగా సినిమా చూసిన ఆనందం అసలు లేకుండా పోయింది. సో కనీసం వచ్చే వీకెండ్ ఆయినా మంచిగా మొదటినుంచి సినిమా చూడాలని అనుకుంటున్నా.

Wednesday, June 17, 2009

సంస్కారం

సుమారు ఒక సంవత్సరం క్రితం జరిగింది ఈ సంఘటన.

అవి నేను న్యూజెర్సీ లోని ప్లేయిన్సుబోరో అనే ప్రాంతంలో ఉంటూ న్యూయార్క్ లో పని చేస్తున్న రోజులు.ప్రతి రోజు ఇంటి నుండి ఆఫీసుకి బస్సులో వెళ్లి వస్తుండే వాడిని. రోజు ఉదయం మా ఇంటి ముందు బస్ ఎక్కితే న్యూయార్క్ లోని "పోర్ట్ ఆథారిటి"లో దిగే వాడిని. మరల సాయంత్రం అక్కడ బస్ ఎక్కితే ఇంటి ముందు దిగేవాడిని.

ఇక్కడ మన దగ్గరలాగ బస్ నిండా జనం ఎక్కుదామంటే కుదరదు. సరిగ్గా బస్సులో ఎన్ని ఐతే సీట్లు ఉంటాయో సరిగ్గా అంత మందినే అనుమతిస్తారు. పైగా మా రూట్లో రోజుకు కేవలం ౪ అంటే ౪ బస్సులే ఉండేవి. మనం సరిగ్గా సమయానికి బస్సు స్టాప్ కి వచ్చినా కూడా మనం బస్సు ఎక్కుతామో లేదో అని సందేహముగా ఉండేది. సరిగ్గా నా దగ్గరకి లేదా ఒకరిద్దరు నా ముందు ఉండగానే సీట్లు అయిపోయాయని డ్రైవర్ బస్సు తలుపు మూసివేసిన సంఘటనలు కూడా ఉన్నాయి నా అనుభవములో. మనం సమయానికి వచ్చినా కూడా బస్ దొరక్కపోతే మహా చిరాగ్గా ఉండేది.

నేను ఎక్కాల్సిన బస్ అక్కడ 416 గేట్లో వచ్చేది. అదే గేట్లో మా రూట్ బస్ కాకుండా ఇంకో వేరే రూట్ బస్ కూడా వచ్చేది. నా బస్ సాయంత్రం 5:30 కి అయితే వేరే బస్ 5:40 కో 5:45 కో ఉండేది. రెండు బస్సుల జనం ఒకటే లైనులో నిలబడేవారు. ఎవరి బస్సు వస్తే వారు ఆ లైనులో ముందుకు వెళ్లి బస్ ఎక్కేవాళ్ళు. మిగతావారు అలాగే తర్వాతి బస్సుకి ఎదురుచూసేవారు.

ఆ రోజు నేను 5:30 కి బస్సు ఎక్కుదామని వచ్చాను కాని దురద్రుశ్టావశాత్తు సరిగ్గా నా ముందున్న అతను ఎక్కగానే సీట్లు అయిపోయాయి. అప్పుడు డ్రైవర్ అన్నయ్య నన్ను జాలిగ ఒక చూపు చూసి బై చెప్పి వెళ్లి పోయాడు. ఇంకా చేసేదేమీ లేక అలాగే అదే లైనులో నిల్చున్నాను. ఇంకా నా వెనకాల చాల మంది తర్వాతి వేరే రూట్ బస్సు వాళ్ళు ఉన్నారు. పది నిమిషాలు అయ్యాక ఆ బస్సు రాగానే ఇంకా అందరు వరుసగా ఎక్కేసాకా నేను ఒక్కడినే అలాగే బయట లైనులో నిల్చున్నాను నా బస్సు కోసం ఎదురుచూస్తూ.ఇంకా ఆ బస్సు కూడా బయలు దేరడానికి సిద్దంగా ఉంది. డ్రైవరు కూడా ఇంక తలుపు మూసేసాడు. ఇంక ఆ బస్సు వెళ్ళిపోతే మళ్ళీ ఆ రూట్ బస్సు 30 నిమిషాల తర్వాతే...

సరిగ్గా అప్పుడు సుమారు 50 ఏళ్ళు ఉన్న ఒక అమెరికన్ భుజాన పెద్ద సంచితో బస్సు ఎక్కడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేనేమో కొంచం పక్కన నిలబడి నా బస్సు కోసం ఎదురు చూస్తున్నాను. లైనులో ఎవరు లేకపోవడం, బస్సు ఆల్రెడీ స్టార్ట్ అవటముతో అతను డైరెక్ట్ గా గేట్ తెరుచుకొని బస్ ఎక్కడానికి లోనికి వెళ్ళాడు. గేట్ తెరుచుకొని లోపలికెళ్ళి సరిగ్గా బస్ ఎక్కే సమయానికి అతనికి నేను కనపడ్డాను. అంతే వెంటనే బయటకు వచ్చి "అయాం సారి, మీరు లైనులో ఉన్నారా" అని అడిగాడు. నాకైతే ఒక్క క్షణం ఆశ్చర్యం వేసింది. "లేదండి, నేను వేరే బస్ కోసం ఎదురుచూస్తున్నా" అని చెప్పటముతో కృతఙ్ఞతలు చెప్పి అతను వెళ్లి బస్సులో కూర్చున్నాడు.

నాకైతే నిజంగా అప్పుడు భలే ముచ్చటేసింది. అంత కష్టపడి పరిగెత్తుకుంటూ, ఆయాసముతో వచ్చి కూడా, బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉందని తెలిసి కూడా, పైగా తర్వాతి బస్సు మళ్ళా అరగంట వరకు లేదని తెలిసి కూడా నన్ను చూసి నేను లైనులో ఉన్నానేమో అని బయటకి వచ్చి నన్ను అడిగాడంటే అతని పద్ధతికి, సంస్కారానికి నాకు భలే ఆశ్చర్యం, ఆనందం ఇలా అన్ని అనుభూతులు ఒకేసారి కలిగాయి. అప్పుడు నాకు మన వాళ్ళు మన దేశములో బస్సు స్తాండుల్లో, రైల్వే స్తేషాన్లల్లో చేసే హడావుడి, తొక్కిసలాట, పక్క వాడిని తోసేసి ఎక్కే విధానం అన్ని గుర్తుకు వచ్చాయి. బాధపడాల్సిన విషయం ఏంటంటే ఎలాగు అందరికి చోటు దొరుకుతుందని తెలిసిన కూడా, ఆడవాళ్ళూ, పిల్లలు, వృద్దులు ఉన్నాకూడా మన వాళ్ళు అంత ఓపికగా, చక్కగా వరుసలో నిల్చొని వెళ్ళడం చాల అరుదు.

Friday, June 05, 2009

వావ్, నెదర్లాండ్స్ !!!!

నిజంగా ఈరోజు అద్భుతమే జరిగింది. క్రికెట్లో పసికూనలైన నెదర్లాండ్స్ వాళ్ళు ఐసిసి టి౨౦ ప్రపంచ కప్పు లో ఇంగ్లాండ్ మీద సంచలన విజయం సాదించారు. ఇంగ్లాండ్ వాళ్లు చాలా వీజీగా గెలిచేస్తారని అందరు అనుకుని ఉంటారు కాని నెదర్లాండ్స్ వాళ్ళు చక్కని ఆట ప్రదర్శించి మొదటి మ్యాచ్లోనే సంచలనాన్ని సృష్టించారు. ఇది చూస్తుంటే ముందు ముందు మనకు మళ్ళీ చక్కని వినోదం దొరకబోతోందని అనిపిస్తుంది. మొత్తానికి మళ్ళీ ఒక నెల్లాళ్ళ పాటు అందరం టి.వి.లకు అతుక్కుపొవదమె..చూద్దాం... మన వాళ్ళు ఎలా ఆడతారో...

Friday, May 22, 2009

శభాష్ డెక్కన్ చార్జర్స్!!!

ఈరోజు జరిగిన IPL2009 మొదటి సెమీఫైనల్లో డెక్కన్ చార్జర్స్ జట్టు పటిష్టమైన డిల్లీ జట్టుని ఖంగు తినిపించి ఫుల్ చార్జింగ్ తో ఫైనల్లోకి అడుగుపెట్టారు. నిజంగా గిల్క్రిస్ట్ ఆట చూడడానికి రెండు కళ్ళు సరిపోవేమో. మొదటి ఓవర్ నుంచే డిల్లీ మీద ఎదురుదాడి చేసి సిసలైన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 35 బంతుల్లో 85 పరుగులు (అందులో 10 ఫోర్లు, 5 సిక్సులు) అంటే ఏ ఫార్మాట్ క్రికెట్లో నైనా అధ్బుతం. ఇదే ఊపు ఆదివారం ఫైనల్లో కూడా చూపించి కప్పు సాదించాలని కోరుకుంటున్నాను. 

ఈరోజు ఆఫీసులో ఉన్నానన్న మాటే కాని పని మీద అసలు మనసు నిలవలేదు. ఆఫీసులో మ్యాచ్ లైవ్ చూడడం కుదరదు కాబట్టి క్రికిన్ఫో వాడి సైట్ ఓపెన్ చేసి బాల్ బాల్ కి స్కోరు చూస్తూ మొత్తానికి పూర్తి మ్యాచ్ చూసాను. అసలే ఈ వీకెండ్ లాంగ్ వీకెండ్ ఆయే. ఆఫీసులో ప్రతి వక్కరు హాలిడే మూడ్లోకి వెళ్లిపోయారు. సందట్లో సడేమియాలాగా మనం క్రికెట్ చూసుకుంటూ గడిపేశాను. మొత్తానికి డెక్కన్ జట్టు గెలిచినందుకు ఆనందంగా ఉంది.

కొసమెరుపు: ఇంకా డిల్లీ జట్టు ఎలాగూ అవుట్ అయింది కాబట్టి ఇంకా కప్పు మన దక్షిణ భారతానిదే.

Wednesday, September 12, 2007

తెలుగు ఆన్లయిన్ రేడియో - టోరి

మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, తెలుగువన్.కాం వారు ఒక ఆన్లయిన్ రేడియో TORI ని ఈ మధ్యే ప్రారంభించారు. ప్రస్తుతం ఇందులో ఏకకాలంలో 5 స్టేషన్లు 24 గంటలు కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాయి. వీటిని మన కంప్యూటర్లో సులభంగా వినడానికి నేను ఒక చిన్న play list file తయారు చేసాను. కింద ఇచ్చిన వాక్యాలను ఒక ఫైల్లో కాపీ చేసి దానిని .pls ఎక్స్టెన్షన్ తో కాపాడండి. ఉదా TORI.pls అన్నమాట. దీనిని మీ కంప్యూటర్లో ఓపెన్ చేస్తే చక్కగా మనం 24 గంటలు తెలుగు పాటలు వినవచ్చు.
[playlist]
NumberOfEntries=5
File1=http://38.101.195.5:8332/
File2=http://38.101.195.5:8132/
File3=http://38.101.195.5:8032/
File4=http://38.101.195.5:8232/
File5=http://38.101.195.5:8432/

నేను వీటిని వినడానికి Real Player ఉపయోగిస్తున్నాను. windows media player లో ఏదో కోడెక్ సమస్యలు ఉన్నాయి నా కంప్యూటర్లో ..

Thursday, August 23, 2007

పర్యావరాణాన్ని కాపాడండి

ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలలో పర్యావరణ సమస్య ఒకటి. కేవలం మనమే మన చేతులారా పర్యావరణానికి హాని చేస్తున్నాము. దీనివల్ల భూమిపై కాలుష్యం పెరిగి ఎన్నో దుష్పరిణామలు ఏర్పడుతున్నాయి. కావున దీనికి మన వంతుగ మన చేతనైనంతలో మనం కొన్ని చిట్కాలు పాటించి ఈ అవనికి మన వంతు సేవ మనం చేద్దాం.

మనకు తెలుసు ఈ రొజుల్లో మన జీవితాలతో కంప్యూటర్లు ఎంతగా పెనవేసుకొని పొయాయో. కాని ఈ కంప్యూటర్ల వల్ల పర్యావరణానికి చాల హాని కలుగుతుందంటే మనలో చాల మందికి ఆశ్చర్యముగా ఉండొచ్చు. మనం కంప్యూటర్లు ఉపయోగించినప్పుడు అది వాడుకునే విద్యుశ్చక్తిని తయారు చేయడానికి ఇంధనాలు మండించడమో లేక మరేదో మార్గమ్లో పర్యావరణానికి హాని కలుగుతుంది.

మీరు నమ్మండి నమ్మక పొండి, మనం సాధారణముగా ఉపయోగించే డెస్కుటాప్ పి.సి. కి సరఫరా అయ్యే విద్యుతులో సగం వరకు వ్రుధా అవుతుంది. కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల ఇవి ఉపయోగించే విద్యుత్ ని గణనీయముగ తగ్గించ వచ్చు. ఒక సర్వే ప్రకారం తేలిందేంటంటే డెస్కుటాప్ పి.సి.లు వాడే విద్యుత్లో సుమారు 70%-80% వరకు మనం ఆదా చేయవచ్చు. ఆ చిట్కాలేవో ఇక్కడ చూద్దామా?

1. మనమ్ కంప్యూటర్ని ఉపయోగించనప్పుడు మానిటర్ని స్విచ్చ్-ఆఫ్ చేయడం.

2. మన మానిటర్లో బ్రైట్నెస్ ని వీలు అయినంతగా తగ్గించడం.

3. మన కంప్యూటర్లో పవర్ మానెజిమెంట్ ఫీచర్ ని ఆన్ చేయదం. ఈ రొజుల్లో లభించే దాదాపు ప్రతి కంప్యూటర్లో కూడా పవర్ మానేజిమెంట్ ఫీచర్ ఉంటుంది. దానిని సరిగ్గా కాన్ఫిగర్ చేయడం ద్వారా మన కంప్యూటర్ ఉపయోగములో లేనప్పుడు దానంతట అదే ఆగిపొవడం లేదంటే కేవలం మానిటర్ ఒకటే స్విచ్-ఆఫ్ కావడమ్ జరుగుతుంది.

4. ఇంక చివరగ మనం కొత్త కంప్యూటర్లు కొనేముందు అవి తప్పని సరిగా ఎనర్జి-స్టార్ 4.0 కంప్లైంట్ ఉండేలా చూడండి.

Saturday, August 18, 2007

వర్డ్ ప్రెస్ బ్లాగ్స్

నేను ఈ మధ్య గమనించిన విషయం ఏమిటంటే వర్డ్ ప్రెస్ బ్లాగ్స్ సరిగ్గా లోడ్ అవడమ్ లేదు. ప్రతి రోజు కూడలిని ఎంతో ఉత్సాహంగా తెరుస్తాను కొత్త కొత్త టపాలు చదవాలి అని. కాని అందులోని కొన్ని బ్లాగ్స్ ముఖ్యంగా వర్డ్ ప్రెస్ లో హోస్ట్ చేసిన బ్లాగ్స్ చాలా మటుకు లోడ్ అవడం లేదు. మరల మరల ప్రయత్నించగా కొన్ని బ్లాగ్స్ వస్తున్నాయి, కాని కొన్ని మాత్రమ్ అసలు రావడం లేదు. కాని అదే సమయంలో మన బ్లాగ్ స్పాట్లోని బ్లాగ్స్ మాత్రం చక్కగ దర్శనమిస్తున్నాయి. ఖచ్చితంగా ఇది మాత్రం నా అంతర్జాల సమస్య మాత్రం కాదు అని చెప్పగలను. ఎందుకంటే నేను మిగతా అన్ని సైట్లను చక్కగా వీక్షించగలుగుతున్నాను.

ఇది కేవలం నా ఒక్కడికే వస్తున్న సమస్యా లేక మీలో ఇంకా ఎవరికైనా ఎదురయిందా? ఒక వేళ మీలో ఎవరికైనా ఏదైన పరిష్కారం తెలిస్తే సూచించగలరు.

0-5-10-25

ఏంటి ఈ సంఖ్యలు అని అనుకుంటున్నారా? వీటికి మన ఆరోగ్యకరమైన జీవితానికి చాలా దగ్గరి సంబంధం ఉందండి.

ఈ మధ్య మా ఆఫీసులో కొత్తగా 0-5-10-25 ప్రోగ్రాం అని మొదలెట్టారు. దీనిలోని ప్రతి సంఖ్యకి ఒక విశేషం ఉంది. మనం ఆరోగ్యంగా జీవించడానికి ఇవి చాలా అవసరం. అవేంటో ఇక్కడ చూడండి.

0 - సున్నా అనగా శూన్యం లేదా ఏమి లేకపోవడం. అంటే మనం జీవితంలో ఎప్పుడూ కూడా పొగాకు మరియు దానికి సంబంధించిన ఉత్పత్తులు అసలు ఉపయోగించకూడదు.

5 - అయిదు ఏంటంటే మనం ప్రతి రోజు తప్పనిసరిగా కనీసం అయిదు రకాలైన కూరగాయలు లేదా పండ్లు మన ఆహారంలో తీసుకోవాలి.

10 - పది ఏంటంటే మనం ప్రతి రోజు తప్పని సరిగా కనీసం పదివేల అడుగులు నడవడమో లేక ఒక ముప్పై నిమిషాలు ఏదైనా వ్యాయామం చేయడమో చేయాలి.

25 - ఇంక చివరగా పాతిక ఏంటంటే మనం మన BMI(Body Mass Index) ని ఎల్లప్పుడూ పాతికలోపలే ఉంచుకోవాలి.

మీరు అంతా కూడా ఇవన్నీ ఆచరించి నిరంతరం ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.

"సర్వేజనా సుఖినోభవంతు"

Monday, August 13, 2007

మంటనక్క తో తంటాలు


నేను నా బ్లాగ్లో టపాలు రాయడానికి లేఖిని వాడుతున్నాను. నేను రాయాలనుకున్నదంతా ముందు లేఖినిలో రాసుకోని తర్వాత దానిని మొత్తం కాపీ చేసుకొని నా బ్లాగ్లో కొత్త టపా డబ్బాలో అతికిస్తున్నాను. మొదటినుంచి కూడా నేను ఈ విధానాన్నే అనుసరిస్తున్నాను. ఇలా చేయడం వల్ల నా టపాలు IE లో చాలా చక్కగా కనపడుతున్నాయి. కాని మంటనక్కలో మాత్రం హెడింగ్స్ సరిగ్గా కనపడ్డం లేదు.

నాకు మంటనక్క ఉపయోగించడం అంటే చాలా ఇష్టం. కాని నా ఈ సమస్య వల్ల బ్లాగ్లు మాత్రం నేను IEలో చూస్తున్నాను, మిగతా అంతర్జాల విహారానికి మాత్రం మంటనక్కను ఉపయోగిస్తున్నాను.

దయచేసి ఎవరయినా ఈ సమస్యకి పరిష్కారం చూపించగలరా? మన మిగతా చాలా మంది మిత్రుల బ్లాగ్లు మంటనక్కలో కూడా చక్కగా కనపడుతున్నాయి. నేను నా బ్లాగ్లో పాత టెంప్లేట్ వాడుతున్నందువల్ల ఈ సమస్య ఏమయినా వస్తుందా?

Sunday, August 12, 2007

తొక్కలో సందేహం

నాకు ఎప్పటినుంచో ఉన్న ఒక సందేహం ఏమిటంటే మన తెలుగు సినిమాలలో పేర్లు వేస్తున్నప్పుడు అందరివి తెలుగులో వేసి చివరగా నిర్మాత, దర్శకులవి మాత్రం తెలుగు మరియు ఇంగ్లీష్లో వేస్తారు. ఎందుకలగ??

Friday, July 13, 2007

అమెరికా జీవితం

అమెరికా జీవితం గురించి నాకు కలిగిన అభిప్రాయం.

ఇక్కడ అమెరికాలో మనకు సెల్ఫోన్,కార్,ఇంటర్నెట్ ఎంతగా అవసరమో మూడు వాక్యాల్లో నా ఫీలింగ్.

1. సెల్ఫోన్ లేదు అంటే మన పరిస్థితి మూగ,చెవిటి లాంటిది.
2. కార్ లేదు అంటే మన పరిస్థితి వికలాంగుల పరిస్థితే.
3. ఇంక చివరగా ఇంటర్నెట్ లేదు అంటే మనం గుడ్డీ వాళ్ళ కిందే లెక్క.

నేను ఇక్కడకి వచ్చి ఇప్పటికి దాదాపు నెల రోజులు కావొస్తుంది. నాకు పైన చెప్పిన వేవి లేవు. ఈ నెల రోజుల్లో నేను అనుభవించిన కష్టాలు నాకు ఈ ఫీలింగ్ కలిగించాయి.

Tuesday, July 03, 2007

'టిప్పు ' సుల్తాన్

మొన్న పొయిన ఆదివారం మా కంపనీ ప్రెసిడెంట్ మా గెస్ట్ హౌస్ కి వచ్చిన సంధర్భంగా రూంలో ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేసుకున్నాము. సరే పార్టీ కదా ఎవరికి ఇష్టం వచ్చినది వారు త్రాగుతున్నారు, తింటున్నారు. ఇంతలో మా వాడు ఒకడికి వెజిటేరియన్ పిజ్జా తినాలనిపించింది. షాప్ కి వెళ్లి కొనుక్కురావలంటే సమయం రాత్రి 10.00 అవుతుంది. పైగా మా వాళ్లకి ఎవరికి ఇక్కడి అమెరికా డ్రయివింగ్ లైసెన్స్ లేదు. సరేలే ఆన్లయిన్లో ఆర్డర్ ఇద్దాము లెమ్మని www.pizzahut.com సైట్ కి వెళ్లి ఒక 2 వెజ్ పిజ్జాలు ఆర్డర్ ఇచ్చాము. వాడు సైట్ లో డెలివరీ టైం 30 నిమిషాలు అని ఇచ్చాడు. సరేలే ఇక చేసేదేముంది అని అలాగే పార్టీ ఎంజాయ్ చేస్తూ పిజ్జా కోసం ఎదురు చూస్తున్నాము.

చెప్పొద్దు, నిజంగా ఇక్కడ టైం అంటే టైమె. సరిగ్గా 30 నిమిషాలు అయ్యాయొ లేదొ టింగ్ టింగ్ మని మా డోర్ బెల్ మోగింది. డోర్ తెరవగానె ఎదురుగా పిజ్జాహట్ డెలివరి బాయ్ పిజ్జాలు నీట్ గా ప్యాక్ చేసుకోని వచ్చాడు. ఆహా, ఏమి సమయపాలన అనుకుంటు వాడి దగ్గర నుంచి పిజ్జాలు తీసుకోని బిల్ తీసుకున్నాను. బిల్ల్ చూస్తే 31డాలర్స్ 50సెంట్స్ అయింది. నా దగ్గర చూస్తే సరిపొయే చిల్లర లేదు. ఆహ వీడు సరిగ్గా సమయానికి తెచ్చాడు. పాపం వీడికి ఒక 1-2 డాలర్స్ అయినా టిప్ ఇవ్వాలి అని అనుకుంటు రెండు 20 డాలర్ నోట్లు వాడికి ఇచ్చాను. ఇలా డబ్బులు ఇచ్చానో లేదో అలా వాటిని జేబులో పెట్టుకుంటు "థాంక్యూ సర్" అని వెళ్లిపోయాడు. చెప్పొద్దు నాకు అసలు నొటమ్మట మాట రాలెదు. వెదవ 31.5డాలర్స్ కి 8.5డాలర్స్ టిప్ తీసుకున్నాడు. అంటే దాదాపు 26% అన్నమాట.

తర్వాత మా ఫ్రెండ్ చెప్పాడు, ఇక్కడ మనం ఏమి సెపరేట్గా టిప్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మనం ఇచ్చిన డబ్బులు టిప్ తో కలిపే ఇచ్చామనుకుంటారు అని. ఒకవేళ మనం చిల్లర లేక ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఇచ్చెముందే చెప్పాలంట ఎంత తీసుకోవాలో అని. మొత్తానికి ఎలా అయితేనేమి ఆ రోజు నా ప్రమేయం లేకుండానే టిప్పు సుల్తాన్ అయిపొయాను.

Saturday, May 12, 2007

మదర్స్ డే

ముందుగా ఈ రోజు మదర్స్ డే సందర్భంగా ప్రపంచంలోని అమ్మలందరికి "ఎ వెరీ వెరీ హ్యపీ మదర్స్ డే".

"అమ్మ" - నాకు తెలిసి ఈ స్రుష్టిలో అమ్మ కన్న గొప్పది ఇంకేమి లేదు. అమ్మే లేకపోతే మనమెవరమూ లేము. మనల్ని నవమాసాలు మోసి, పురుటి నొప్పులు భరించి కని, మనల్ని కంటికి రెప్పలాగా కాపాడి, మన ఆలనా పాలనా చూసి, పెంచి పెద్ద చేస్తుంది. మరి అలాంటి అమ్మకి మనం ఏమి చేసినా తక్కువే.

ఒక విషయంలో మాత్రం నేను లక్కీ అని భావిస్తా. అదేంటంటే చిన్నప్పటి నుంచి కూడా నేను అమ్మని విడిచి ఉన్నది చాలా తక్కువ. చిన్నప్పుడు 10వ తరగతిలో ఒక సంవత్సరం మాత్రం హస్టల్లో ఉన్నాను. అదొక్కటే నేను అమ్మని విడిచి చాలా రోజులు ఉన్నది. తర్వాత పాలిటెక్నిక్ కోసం హైదరాబాద్లో 3 సంవత్సరాలు హస్టల్లో ఉన్నాను కాని ప్రతి శని, ఆది వారాలు తప్పకుండా ఇంటికి వెళ్లేవాడిని. అప్పట్లో మేము నల్లగొండ జిల్లా "ఆలేరు"లో ఉండేవాళ్లం. అది హైదరాబాద్ కి జస్ట్ 70కి.మీ. మాత్రమే. నాన్నగారు రైల్వేలో పనిచేస్తుండడం చేత నాకు అప్పట్లో ఫ్రీ రైల్వే పాస్ ఉండేడిది. అందుకని నాకు అప్పట్లో ఇంటికి దూరంగా ఉన్నాను అనే బెంగ ఉండేది కాదు. కాని పోయినేడాది అమెరికా వెళ్లినప్పుడు మాత్రం అమ్మని, అమ్మ చేతి వంటని చాలా మిస్ అయ్యాను. దాని మీద వ్రాసిన టపా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పాపం మా చిన్న తమ్ముడు మాత్రం ఈ విషయంలో నాకు పూర్తిగా వ్యతిరేకం. వాడు ఇప్పటికి దాదాపు 10 సంవత్సరాలుగా చదువు, ఉద్యోగ నిమిత్తం ఇంటికి దూరంగా ఉంటున్నాడు. వాడి ఉద్యోగం కూడా ఇప్పుడు గుజరాత్ లోని వడొదరలో. మేము ఎప్పుడు మాట్లాడుకున్నా వాడు తప్పకుండా అనే మాట ఒకటి ఏంటంటే "నువ్వు నిజంగా చాలా లక్కీ, ఎప్పుడూ అమ్మ దగ్గరే ఉంటావు" అని.

అమ్మ గురించి ఎక్కడో చదివిన ఈ వాక్యం నాకు ఎంతో ఇష్టం.

"దేవుడు ప్రతి చోట తను ఉండడం సాధ్యం కాక అమ్మను స్రుష్టించాడు" నిజంగా నిజం కదూ ఈ మాట.

Tuesday, April 24, 2007

లగ్గం పిలుపు

లగ్గం పిలుపు (తెలంగాణా మాండలికంలో)

మా పెద్ద పోరడు
చి ఎల్లయ్య
&
చి సౌ ఎల్లమ్మ
(సత్తెన్న చిన్న బిడ్డ)

అనే పోరిని లగ్గం చేసుకుంటుండు, మరి మీరంతా మొగుడు,పెండ్లాలు, పోరగాళ్లతోని లేకపోతే నచ్చిన పోరి/పోరగానితోని యాది మరవకుండ రండ్రి.
ఎప్పుడుంది అంటే గీ శనివారం దినామ్న పొద్దుగాల్ల DEC 24 న 11.41 కి.

ఎక్కడ్ననంటె మన అశొక్ అన్న హాల్ లేదా, బోయినపళ్లి కాడ, గాడనే..

అన్న మల్ల మరిసిపొవద్దు సూడు మరి మంచిగుండదు రాకుంటే మల్ల...
లగ్గం అయినంక మల్ల మంచిగ తినిబోవాలె సూడు...

మల్ల పిలిచేటోల్లు ఎవలంటే

చిల్లిమాకు పెంటయ్య.

గమనిక: కేవలం సరదా కోసమే ఇది రాసాను. అంతే కాని ఎవరిని నొప్పించడానికి కాదు. ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుడను.

Monday, April 23, 2007

కామన్ పాయింట్

ఇద్దరు బిచ్చగాళ్లు లేదా ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు మొదటిసారి కలుసుకున్నప్పుడు ఏమి మాట్లాడుకుంటారు?
..

..

..

..

..

..

..

..


నువ్వు ఏ ప్లాట్ ఫాం మీద పని చేస్తున్నావు అని...