ఈ మధ్య రాష్త్రంలో గత వారం, పది రోజులుగా ప్రతిరోజు వర్షం వస్తుంది. ఇలా వర్షం వస్తే మనకు బాగానే ఉంటుంది కాని పాపం రైతులకే ఈ అకాల వర్షాల వల్ల పంటలు నాశనం అయిపొతున్నాయి. సరిగ్గా పొద్దున్నే ఆఫీస్ కి వెళ్లే టైంకి వాన మొదలయ్యింది అంటే ఇంక ఆ రోజు ఆఫీస్ కి వెళ్లాలనిపించదు. హాయిగా ఆ రోజుకి ముసుగు తన్ని పడుకుంటే బాగుండు అని అనిపిస్తుంది. చిన్నప్పుడు ఇలా ఆకస్మిక వర్షం వస్తే ఎంచక్కా ఆ రోజుకి స్కూల్/కాలేజికి డుమ్మా కొట్టేసేవాడిని. కాని ఇలా ఎప్పుడు అంటే అప్పుడు ఆఫీస్ కి డుమ్మా కొట్టేస్తే జీతంలో తెగ్గోస్తాడు లేదంటే మనకే శాశ్వతముగా డుమ్మా కొట్టే ప్రమాదం ఉంది.
అప్పుడప్పుడు నాకు ఈ వర్షానికి, నా బండి కి ఏమైనా సంబంధం ఉందా అని అనిపిస్తుంది. అసలే నా బైక్ ఎప్పుడూ మట్టి కొట్టుకుపొయి, బురద మరకలతో ఉంటుంది. ఛా..ఇలా అయితే బాగుండదు, మనం అయితే రోజూ సుబ్బరంగా తయారవుతాము కదా కాబట్టి మన బండి కూడా మన లాగే నీట్ గా ఉండాలి అని ఒకరోజు డిసైడ్ అయిపొయి ఆ రోజు బండి ప్రక్షాళనా కార్యక్రమం మొదలెడతాను. ఒక 30 నిమిషాలు చచ్చి చెడి మొత్తానికి బండిని కొత్త దానిలాగా, చూడగానే ముద్దొచ్చేలా తయారుచేస్తాను. అదేంటో తెలీదు అప్పుడు మాత్రం మన మీద మనకే ఒక విధమైన ఫీలింగ్ కలుగుతుంది.
సరే మొత్తానికి బండి శుభ్రంగా అయ్యింది, ఇంక ఎప్పుడు దీనిని ఇలాగే మైంటైన్ చేయాలి అని అనుకుంటాను. సరే దానిని బయటకి తీసి అలా ఆఫీస్ కో లేక మార్కెట్ కో వెళ్తాను. అదేంటో అప్పటి వరకు కూడా పెళ పెళ ఎండ కాస్తున్నా కూడా సడెన్ గా వాతావరణం మారిపొయి టపటపమని వర్షం మొదలవుతుంది. సరిగ్గా అలా ఓ 10-15 నిమిషాలు పడ్డాకా, నా బండి మొత్తం మళ్లా ఎప్పట్లాగా బురద కొట్టుకుపోయాకా ఆగిపొతుంది. ఇంక అప్పుడు చూడాలి నా పరిస్తితి. నా మీద నాకే చిరాకొచ్చేస్తుంది.
ఏంటో ఎప్పుడు బండి కడిగినా కూడా వర్షం వచ్చేస్తుంది. ఈ సారి అలా చేయకూడదనుకోని దానిని అలాగే వదిలేస్తాను. అప్పుడు ఎన్నాళ్లయినా నా బండి అలాగే ఉంటుంది, వర్షం మాత్రం రాదు. అలా ఆ బురద, మట్టి ఉన్న బండినే తోలుతుంటాను. ఇంట్లో వాళ్లు చూసి చూసి "ఏంట్రా, బండి చూడు ఎలా తగలడిందో, కాస్తా వళ్లు వంచి దానిని కడుగుకోవచ్చు కదా" అని నాలుగు అక్షింతలు వేస్తారు. అప్పుడు మళ్లా ఒకరోజు రెచ్చిపోయి దానిని సుబ్బరంగా కడిగి పెళ్లి కూతురులా ముస్తాబు చేస్తాను, ఆ రోజో లేదా మరుసటి రోజో వర్షం తప్పకుండా వస్తుంది. ఇదంతా ఓ సైకిల్ లాగా ఎప్పుడూ జరుగుతూనే వుంటుంది.
Subscribe to:
Post Comments (Atom)
6 comments:
ఇదేదో బాగుందే.
బాబ్బాబూ మా వూర్లో వర్షం పడటం లేదంట. మీ బండీ తీసుకెళ్ళి మా వూర్లో కడగరూ!
--ప్రసాద్
http://blog.charasala.com
వర్షం మీ చెక్కు చేతల్లో ఉందంటే మీరు దేవుడి కింద లెక్క...
ఇప్పుడు కాదుగానీ వానలు కావాల్సినప్పుడు ఒకసారి మీ బండిని అలా దేశమంతా తిప్పి తీసుకురారాదు మీకు పుణ్యం వుంటుంది.
ఇలా నాకు కొన్ని సార్లు జరిగింది కాబట్టి ఏదో సరదాగా రాసాను, అంతే..నిజంగా నేను ఎప్పుడు బండి కడిగితే అప్పుడు వర్షం వచ్చేట్టయితే ఎప్పుడో చంద్రబాబు కాలంలోనే ఆయనకీ విషయం చెప్పి ఎప్పుడు కావలంటే అప్పుడు వర్షాలు కురిపించేవాడిని.
నా పొస్ట్ కి కామెంట్ రాసిన అందరికి నా ధన్యవాదాలు.
మేం రాసింది సరదాక్కాదా ఏమిటి? :)
--ప్రసాద్
http://blog.charasala.com
బైకు వర్షం మాంచి ఫ్రెండ్సనుకుంట :)
Post a Comment