Wednesday, April 11, 2007

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు "పట్టుదల" సినిమా కోసం రాసిన ఈ పాట నాకు ఎంతో ఇష్టం. సినిమా అంతగా ఆడకపోవడంతో చాలా మందికి ఈ పాట గురించి తెలియదు. కాని ఒక్కసారి ఈ పాట వింటే మాత్రం మనం ఒక విధమైన ఉత్తేజానికి లోను అవ్వడం ఖాయం. ఎంతటి నిరాశా నిస్ప్రుహళ్లో ఉన్నా కూడా ఈ పాట వింటే మనం కొత్త ఉత్తేజాన్ని పొందుతాము. తీవ్ర నిరాశలో కూరుకుపొయి జీవితాన్ని చాలిద్దాం అని అనుకున్న ఎంతో మంది ఈ పాట విని మనసు మార్చుకొని తిరిగి కొత్త జీవితాన్ని మొదలెట్టారని శాస్త్రి గారే స్వయంగా చెప్పారు.

చిత్రం : పట్టుదల
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : జేసుదాస్
సంగీతం : ఇళయరాజా.

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయం రా.. ఎప్పుడూ

నింగి ఎంత గొప్పదైనా రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా
సంద్రమెంత పెద్దదైనా ఈదుతున్న చేపపిల్ల మొప్ప ముందు చిన్నదేనురా
పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా
గుటకపడని అగ్గి ఉండ సాగరాలనీదుకుంటు తూరుపింట తేలుతుందిరా
నిశా విలాసమెంత సేపురా ఉషొదయాన్ని ఎవ్వడాపురా
రగులుతున్న గుండెకూడా సూర్యగోళమంటిదేరా..... ఎప్పుడూ

నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా...
నీరసించి నిలిచిపోతే నిమిషమైనా నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ.
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది
అంతకన్నా సైన్యముండునా
ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను
ఆశయమ్ము సారధౌనురా
నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా
ఆయువంటు ఉన్న వరకు చావుకూడా నెగ్గలేక శవము పైనే గెలుపు చాటురా...........ఎప్పుడూ

నెట్ లో ఈ పాట ఆడియో కోసం ఎంతగానో ప్రయత్నించాను కాని దొరకలేదు. దయచేసి ఎవరి దగ్గరైనా ఈ పాట MP3 లేదా Real ఫార్మాట్ లో ఉంటే దయచేసి నాకు పంపగలరు.

మరిన్ని మంచి పాటలతో మరోసారి కలుసుకుందాం.

సెలవు...

3 comments:

Anonymous said...

పాట కోసం ఇక్కడికి వెళ్ళండి.

http://www.manasirivennela.com/evid.html

ఆ పాట మన శ్రీకృష్ణ దేవరాయలు(ఇస్మాయిల్) కోసం ఇక్కడికి వెళ్ళండి.

http://krishnadevarayalu.blogspot.com/2007/03/blog-post_15.html

విహారి

Anonymous said...

Thanks for putting it up here.

Anonymous said...

మంచి పాటను అందచేసినందుకు కృతజ్ఞతలు. సిరివెన్నెల గారు ఇలాంటి ఆణిముత్యాలనెన్నో రాసారు. మన తెలుగు సినిమా పాటల్లో సాహిత్యం ఇంకా జీవించి ఉందంటే దానికి సిరివెన్నెల లాంటి వారే.