Wednesday, June 17, 2009

సంస్కారం

సుమారు ఒక సంవత్సరం క్రితం జరిగింది ఈ సంఘటన.

అవి నేను న్యూజెర్సీ లోని ప్లేయిన్సుబోరో అనే ప్రాంతంలో ఉంటూ న్యూయార్క్ లో పని చేస్తున్న రోజులు.ప్రతి రోజు ఇంటి నుండి ఆఫీసుకి బస్సులో వెళ్లి వస్తుండే వాడిని. రోజు ఉదయం మా ఇంటి ముందు బస్ ఎక్కితే న్యూయార్క్ లోని "పోర్ట్ ఆథారిటి"లో దిగే వాడిని. మరల సాయంత్రం అక్కడ బస్ ఎక్కితే ఇంటి ముందు దిగేవాడిని.

ఇక్కడ మన దగ్గరలాగ బస్ నిండా జనం ఎక్కుదామంటే కుదరదు. సరిగ్గా బస్సులో ఎన్ని ఐతే సీట్లు ఉంటాయో సరిగ్గా అంత మందినే అనుమతిస్తారు. పైగా మా రూట్లో రోజుకు కేవలం ౪ అంటే ౪ బస్సులే ఉండేవి. మనం సరిగ్గా సమయానికి బస్సు స్టాప్ కి వచ్చినా కూడా మనం బస్సు ఎక్కుతామో లేదో అని సందేహముగా ఉండేది. సరిగ్గా నా దగ్గరకి లేదా ఒకరిద్దరు నా ముందు ఉండగానే సీట్లు అయిపోయాయని డ్రైవర్ బస్సు తలుపు మూసివేసిన సంఘటనలు కూడా ఉన్నాయి నా అనుభవములో. మనం సమయానికి వచ్చినా కూడా బస్ దొరక్కపోతే మహా చిరాగ్గా ఉండేది.

నేను ఎక్కాల్సిన బస్ అక్కడ 416 గేట్లో వచ్చేది. అదే గేట్లో మా రూట్ బస్ కాకుండా ఇంకో వేరే రూట్ బస్ కూడా వచ్చేది. నా బస్ సాయంత్రం 5:30 కి అయితే వేరే బస్ 5:40 కో 5:45 కో ఉండేది. రెండు బస్సుల జనం ఒకటే లైనులో నిలబడేవారు. ఎవరి బస్సు వస్తే వారు ఆ లైనులో ముందుకు వెళ్లి బస్ ఎక్కేవాళ్ళు. మిగతావారు అలాగే తర్వాతి బస్సుకి ఎదురుచూసేవారు.

ఆ రోజు నేను 5:30 కి బస్సు ఎక్కుదామని వచ్చాను కాని దురద్రుశ్టావశాత్తు సరిగ్గా నా ముందున్న అతను ఎక్కగానే సీట్లు అయిపోయాయి. అప్పుడు డ్రైవర్ అన్నయ్య నన్ను జాలిగ ఒక చూపు చూసి బై చెప్పి వెళ్లి పోయాడు. ఇంకా చేసేదేమీ లేక అలాగే అదే లైనులో నిల్చున్నాను. ఇంకా నా వెనకాల చాల మంది తర్వాతి వేరే రూట్ బస్సు వాళ్ళు ఉన్నారు. పది నిమిషాలు అయ్యాక ఆ బస్సు రాగానే ఇంకా అందరు వరుసగా ఎక్కేసాకా నేను ఒక్కడినే అలాగే బయట లైనులో నిల్చున్నాను నా బస్సు కోసం ఎదురుచూస్తూ.ఇంకా ఆ బస్సు కూడా బయలు దేరడానికి సిద్దంగా ఉంది. డ్రైవరు కూడా ఇంక తలుపు మూసేసాడు. ఇంక ఆ బస్సు వెళ్ళిపోతే మళ్ళీ ఆ రూట్ బస్సు 30 నిమిషాల తర్వాతే...

సరిగ్గా అప్పుడు సుమారు 50 ఏళ్ళు ఉన్న ఒక అమెరికన్ భుజాన పెద్ద సంచితో బస్సు ఎక్కడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేనేమో కొంచం పక్కన నిలబడి నా బస్సు కోసం ఎదురు చూస్తున్నాను. లైనులో ఎవరు లేకపోవడం, బస్సు ఆల్రెడీ స్టార్ట్ అవటముతో అతను డైరెక్ట్ గా గేట్ తెరుచుకొని బస్ ఎక్కడానికి లోనికి వెళ్ళాడు. గేట్ తెరుచుకొని లోపలికెళ్ళి సరిగ్గా బస్ ఎక్కే సమయానికి అతనికి నేను కనపడ్డాను. అంతే వెంటనే బయటకు వచ్చి "అయాం సారి, మీరు లైనులో ఉన్నారా" అని అడిగాడు. నాకైతే ఒక్క క్షణం ఆశ్చర్యం వేసింది. "లేదండి, నేను వేరే బస్ కోసం ఎదురుచూస్తున్నా" అని చెప్పటముతో కృతఙ్ఞతలు చెప్పి అతను వెళ్లి బస్సులో కూర్చున్నాడు.

నాకైతే నిజంగా అప్పుడు భలే ముచ్చటేసింది. అంత కష్టపడి పరిగెత్తుకుంటూ, ఆయాసముతో వచ్చి కూడా, బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉందని తెలిసి కూడా, పైగా తర్వాతి బస్సు మళ్ళా అరగంట వరకు లేదని తెలిసి కూడా నన్ను చూసి నేను లైనులో ఉన్నానేమో అని బయటకి వచ్చి నన్ను అడిగాడంటే అతని పద్ధతికి, సంస్కారానికి నాకు భలే ఆశ్చర్యం, ఆనందం ఇలా అన్ని అనుభూతులు ఒకేసారి కలిగాయి. అప్పుడు నాకు మన వాళ్ళు మన దేశములో బస్సు స్తాండుల్లో, రైల్వే స్తేషాన్లల్లో చేసే హడావుడి, తొక్కిసలాట, పక్క వాడిని తోసేసి ఎక్కే విధానం అన్ని గుర్తుకు వచ్చాయి. బాధపడాల్సిన విషయం ఏంటంటే ఎలాగు అందరికి చోటు దొరుకుతుందని తెలిసిన కూడా, ఆడవాళ్ళూ, పిల్లలు, వృద్దులు ఉన్నాకూడా మన వాళ్ళు అంత ఓపికగా, చక్కగా వరుసలో నిల్చొని వెళ్ళడం చాల అరుదు.

10 comments:

పానీపూరి123 said...

>సరిగ్గా బస్సులో ఎన్ని ఐతే సీట్లు ఉంటాయో సరిగ్గా అంత మందినే అనుమతిస్తారు

ఆ పిచ్చి నాయాళ్ళకు బస్సు నిండుగా ఎక్కించాలని తెలియదేమో, వాళ్ళను ఒక్కసారి హైదరాబాదు APSRTC వాళ్ళచే ట్రైనింగ్ ఇప్పిచ్చాలనుకుంటా (బస్సులో ఎలా కుక్కాలో చెబుతారు)

Anonymous said...

ఒక విధమైన ఈర్ష్య ఫీలింగ్ కలిగింది..ముంబై లో ఈ ట్రైన్ లో ప్రయాణించి మీ బ్లాగ్ చూసా
పధ్ధతి అండీ బాబు.. అందుకే అమెరికా అందులో న్యూయార్క్ .బావుంది మీ టపా

Anonymous said...

మరీ అంత బాధ పడిపోకండి. ఇక్కడ మన భారత దేశం లో కూడా, మిమ్మల్ని అడిగినలాంటి వాళ్ళు ఉంటారు.దేశమేదైనా, మన సంస్కారాన్ని బట్టి ఉంటుంది మన ప్రవర్తన.

ఓ చిన్నోడు said...

baaga chepparu maastaru..samskaram uttama lakshanam mari

Unknown said...

Chaalaa Bagundhi mee anubhavam

Srini said...

> పానిపూరి 123 గారు, Anonymous గారు, ప్రదీప్ గారు
టపా చదివి కామెంటినందుకు ధన్యవాదాలు.
> హరేఫల గారు
మీరు చెప్పింది అక్షర సత్యం, అలాంటి వారు ప్రతి చోట ఉంటారు, కాకపొతే మన దగ్గర చాల తక్కువ మంది కనపడతారు, అంతే...

రాధిక said...

"సరిగ్గా బస్సులో ఎన్ని ఐతే సీట్లు ఉంటాయో సరిగ్గా అంత మందినే అనుమతిస్తారు"...అవునా మా ఊరిలో అలా కాదు.బస్సెక్కాకా అరువాతి స్టాపులో దిగేవాళ్ళుంటారు కదా.అప్పుడు బస్సు ఖాళీ అవుతుంది.అప్పుడు సీట్లో కుర్చోవచ్చు.అప్పటిదాకా నిలుచోవడమే.[గమనిక-నేను నాలుగు సార్లు మాత్రమే బస్సెక్కాను]

Srini said...

రాధిక గారు, కామెంటినందుకు ధన్యవాదాలు. మీరు చెప్పింది ఇండియాలోని ఊరా లేక అమెరికాలోనా?

Ravi said...

ఆ క్రమశిక్షణ మన దేశప్రజలకు వంటపట్టడం సాధ్యమేనంటారా?
ఒక వేళ సాధ్యమయితే ఎన్ని తరాలకు ? :-)

Vinay Chakravarthi.Gogineni said...

main adikaademonani...tanaki marala 30 mins nunchunte pakka vastundi ani telusu....mana daggara eppudu vastuno ee route lo veltundo anta confusion.......
alane mana count chudalemo......

kaani atanu chaala chaala great nenu ithe adige vaadini kadu pakka......