అసలు నాకు మొదటి నుంచి కూడా సినిమాలంటే ఆసక్తి ఉంది కాని పిచ్చి మాత్రం లేదు. బాగా క్రేజ్ ఉన్న సినిమాని మొదటిరోజే, వీలుయితే మొదటి ఆటే చూడాలని వేలం వెర్రిగా ఎగబడే టైపు కాదు. పైగా ఒకప్పుడు పెద్దగా కష్టపడకుండా టికెట్స్ దొరికాయని కేవలం రెండంటే రెండే సినిమాలు మొదటి రోజే చూడడం, అవి కాస్తా మన 'లెగ్' మహత్యమో ఏమో కాని బాక్సాఫీసు వద్ద బొక్కాబోర్లా పడ్డాయి. అంచేత అప్పటి నుంచి సిని నిర్మాతల శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకొని అప్పటి నుంచి 'మొదటి రోజు ఆట' మానుకున్నాను.
ఇక పొతే ఈ మగధీర సినిమా విషయానికొస్తే, చిత్రం షూటింగ్ జరిగినన్నాల్లు మీడియాలో వచ్చిన కథనాలు చదివి ఈ సినిమాని మొదటి రోజు కాకున్నా తొందరగానే చూడాలని నిశ్చయించుకున్నాను. సినిమా విడుదల అయ్యాక ఇంకా అన్ని సైట్లలో సమీక్షలన్నీ అదరగొట్టే లెవెల్లో ఉండడం చేత ఇంక వెంటనే రంగంలోకి దిగి, ఇద్దరు స్నేహితులను వాళ్ళ కుటుంబాలతో సహా పోగేసి రెండో రోజు మధ్యాన్నం ఆటకి టికెట్స్ బుక్ చేసాము.
ఇక్కడ న్యూజెర్సీలో మేము ఉండే ఏరియాలో థియేటరులు అంతగా బాగుండవు. మా ఇంటికి ఒక ౩ మైళ్ళ దూరములో ఓక్ ట్రి లో ఒక థియేటర్ ఉంది. సాదారణంగా మేము సినిమాలన్నీ అందులోనే చూస్తాము. టికెట్స్ ఈజీగా దొరుకుతాయి. పైగా ఇంటికి చాల దగ్గర, పక్కనే మంచి రెస్టారెంట్లు. హాయిగా తినేసి చక్కగా హాల్లోకి వెళ్ళొచ్చు. కాకపోతే థియేటర్ మాత్రం డొక్కు. అందుకని మా ఇంటికి ఒక ౩౦ మైళ్ళ దూరంలోని ఈస్ట్ విన్డుసార్లోని మల్టిప్లెక్స్ లో ఈ సినిమాకి టికెట్స్ తీసుకున్నాము.
ఇక శనివారం పొద్దున్న తీరిగ్గా లేచి పనులన్నీ చేసుకొని, లంచ్ అయ్యాక రెండు కార్లలో మొత్తం ఆరుగురం సరిగ్గా రెండు గంటలకు బయలు దేరాము. సినిమా ఏమో 3.15 కి. మాములుగా ఐతే 30 నిమిషాలలో అక్కడకి వెళ్ళొచ్చు. కాస్తా ముందుగా వెళ్లి, తీరిగ్గా బండి పార్క్ చేసుకొని, మంచి సీట్లో కూర్చొని(ఎందుకంటే ఇక్కడ మాకు టికెట్స్ మీద సీట్ నెంబర్లు ఉండవు, ఎవరు ముందుగా వస్తే వాళ్లకు మంచి సీట్) సినిమా చూద్దామని అనుకున్నాము.
మాములుగా నేను ఎప్పుడు మా ఇంటి నుంచి అటు వైపు వెళ్ళడానికి రూటు 1 తీసుకుంటాను. కాకపోతే ఆ రోజు నా GPS మాత్రం న్యూజెర్సీ టర్న్ పైక్ మీదుగా తీసుకెళ్ళింది. సరే అలా ఐతే టోల్ రోడ్ కాబట్టి తొందరగా వెళ్ళొచ్చు అని అనుకున్నాను. ఒక పది నిమిషాలు చక్కగా వెళ్ళగానే ఇంక ట్రాఫిక్ జాం మొదలయ్యింది. ఇంక అందులో ఇరుక్కుంటే ముందుకు వేల్లలేము, వెనక్కు రాలేము, పక్కకు జరగలేము. ఆరోజు మా అద్రుష్టం పడిశం పట్టినట్టు పట్టడముతో ఎక్కడి ట్రాఫిక్ అక్కడే ఆగిపోయింది. ఒక పక్క సమయం కావస్తుంది. ఇంక ఆ ట్రాఫిక్ లోనే అలా అలా మెల్లిగా వెళ్లి తర్వాత వచ్చిన ఎక్జిట్ తీసుకొని లోకల్ రోడ్ మీదుగా వెళ్ళేసరికి పుణ్య కాలం కాస్తా అయ్యి సరిగ్గా 4 గంటలకు హాల్లోకి వెళ్ళాము. వెళ్ళేసరికి తెర ముందున్న మొదటి వరుస తప్ప అన్ని సీట్లు నిండిపోయాయి. జీవితములో అలా మొదటి సారిగా ముందు వరుస లో కూర్చొని సినిమా చూసాక తలనొప్పి, మెడ నొప్పి, నడుము నొప్పి పట్టుకున్నాయి. పైగా సినిమా చూసిన ఆనందం అసలు లేకుండా పోయింది. సో కనీసం వచ్చే వీకెండ్ ఆయినా మంచిగా మొదటినుంచి సినిమా చూడాలని అనుకుంటున్నా.